అంధకారంలో సీమాంధ్ర: ఆర్టీపీపీ, వీటీపీఎస్ లలో నిలిచిపోయిన విద్యుత్
సీమాంధ్ర జిల్లాలు అంధకారంలో కూరుకుపోయాయి. విద్యుత్ ఉద్యోగులు సమ్మెను కొనసాగిస్తుండటంతో వీటీపీఎస్, ఆర్టీపీపీలలో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
మరోవైపు సీమాంధ్ర విద్యుత్ జేఏసీతో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సమైక్యాంధ్రకు అనుకూలంగా నిర్ణయం వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు అధికారులకు తేల్చి చెప్పారు.
రాష్ట్ర విభజనకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంతో విద్యుత్ ఉద్యోగులు సమ్మెను ఉధృతం చేశారు. దీంతో ఆర్టీపీపీ, వీటీపీఎస్ లలో విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. ఉద్యోగుల సమ్మెతో దశల వారీగా సీమాంధ్ర జిల్లాలు అంధకారమవుతున్నాయి. మరోవైపు సీమాంధ్ర విద్యుత్ జేఏసీతో ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
ఉద్యోగుల సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమ్మె విరమించాలని అధికారులు విజ్ఞప్తి చేసినా ఉద్యోగులు ఖాతరు చేయడం లేదు. కేంద్ర కేబినెట్ నోట్ ఉపసంహరించుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని విద్యుత్ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. వీటీపీఎస్ లోని 7వ యూనిట్ లో కూడా విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
అత్యవసర సేవలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకున్న ప్రభుత్వం విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం ముందు నిలిచే పరిస్థితి కనిపించడం లేదు. విజయనగరం, ఏలూరు, ఒంగోలు, విజయవాడ, గుంటూరు నగరాల్లో దాదాపు 8గంటలకు పైగా విద్యుత్ కోతలను విధిస్తున్నారు.
గ్రామాల్లో అయితే పూర్తి అంధకారంలో చిక్కకున్నాయి. ప్రజల అవసరాలు తీర్చేందుకు ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కోనుగోలు చేసినా ఏపీ ట్రాన్స్ కో ఉద్యోగులు సమ్మెలో ఉండటంతో ప్రజలకు పంపిణీ చేసే వ్యవస్థ మాత్రం కుప్పకూలింది. కడపలోని ఆర్టీపీపీలోనూ వెయ్యిన్ని 50మెగావాట్ల విద్యుదుత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది.
ఉద్యోగుల సమ్మెతో కడప జిల్లాతో పాటు ఆర్టీపీపీకి అనుసంధానమైన గ్రిడ్ లలోనూ విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఆర్టీపీపీలో పనిచేసే 3వేల 2వందల మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొంటున్నారు. ఆర్టీపీపీ ఉద్యోగుల సమ్మెతో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కరెంట్ కష్టాలు తప్పడం లేదు.
రైళ్ల రాకపోకలతో పాటు సాధారణ గృహ వినియోగానికి కూడా విద్యుత్ సరఫరా ఉండదని ఉద్యోగులు చెబుతున్నారు. ఇది మొదటి మెట్టేనని, విద్యుత్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఈ సమ్మె మరో రెండు మూడు రోజులు కొనసాగితే విద్యుత్ సంక్షోభం ఏర్పడటం ఖాయమని చెబుతున్నారు.
రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోన్న విద్యుత్ ఉద్యోగుల సమ్మె
విద్యుత్ ఉద్యోగుల సమ్మె రైల్వే శాఖపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వీటీపీఎస్, ఆర్టీపీపీలలో విద్యుదుత్పత్తి నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. చేసేదేమీ లేక కొన్ని రైళ్లను రద్దు చేశారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్లు అన్న చందంగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె రైళ్లపై పడుతోంది. రాష్ట్రంలోని ప్రధాన విద్యుదుత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. పలు రైళ్లను రద్దు చేస్తున్నారు. మరి కొన్నింటిని ఆలస్యంగా నడిపిస్తున్నారు.
ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా డీజిల్ ఇంజిన్ల సాయంతో ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు తరలిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రైల్వే స్టేషన్లలో పలు రైళ్లు నిలిచిపోయాయి. పలాస స్టేషన్ లో హౌరా-చెన్నై మెయిల్, షాలిమార్ ఎక్స్ ప్రెస్, పాండిచ్చేరి ఎక్స్ ప్రెస్, సోంపేటలో ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్, గౌవహతి-బెంగుళూరు ఎక్స్ ప్రెస్ లు నిలిచిపోయాయి.
ఒడిషాలోని బరంపురం నుంచి డీజిల్ తెప్పించి రైళ్లను నడుపుతున్నారు. రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో ప్రయాణీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మెతో రైళ్ల రాకపోకలకూ అంతరాయం ఏర్పడింది.
ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ల పరిధిల్లోని తాడేపల్లి గూడెం, వట్లూరు, కొండపల్లి, క్రిష్ణా కాలువ, ఒంగోలు తప్ప ఇతర అన్ని రైల్వే ట్రాక్షన్ సబ్ స్టేషన్లలో అంతరాయాలు ఏర్పడ్డాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యుత్ ఉత్పత్తి, సరఫరాల్లో అంతరాయం ఏర్పడకుండా చూసేందుకు ఉన్నతాధికారులు ఆపసోపాలు పడుతున్నారు.
ఈరోజు 350మెగావాట్ల విద్యుత్ ను అదనంగా కొనుగోలు చేశారు. నలభై ఎనిమిది గంటల సమ్మె గడువు పూర్తయ్యేలోగా దక్షిణాది గ్రిడ్ కు ముప్పు రాకుండా విద్యుత్ డిమాండ్ , పంపిణీలను క్రమబద్దీకరించడం సహా అన్ని ముందు జాగ్రత్తలూ తీసుకుంటున్నారు.